SHOCKING NEWS: హోటల్‌లో నవ వధువు అనుమానాస్పద మృతి.. భర్తపై కుటుంబ సభ్యుల అనుమానం..!

Jhansi hotel bride death

జాతీయం, అక్టోబర్ 26, 2026: పెళ్లై నాలుగు నెలలు కూడా గడవకముందే ఓ నవ వధువు హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు విడిచిన ఘటన ఝాన్సీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఝాన్సీలోని రిషబ్ హోటల్‌లో బస చేసిన ముస్కాన్ సిమోలియా(24) అనే యువతి అక్టోబర్ 23న కుప్పకూలిపోయి మృతి చెందింది. అయితే, ఆమె భర్త నిలేష్ కుట్రపూరితంగానే ఆమెను అంతమొందించాడని ముస్కాన్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. ముస్కాన్ సిమోలియాకు బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్న నిలేష్‌తో ఈ ఏడాది జూన్‌లో వివాహం జరిగింది. అక్టోబర్ 23న ఝాన్సీలోని రిషబ్ హోటల్‌లో రూమ్ నంబర్ 212 లో బస చేసిన వీరు, గదిని ఖాళీ చేసే క్రమంలో ముస్కాన్ అకస్మాత్తుగా కింద పడిపోయి ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి రామ్‌జీ లాల్ అహిర్వార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిలేష్ తన మొదటి పెళ్లి విషయాన్ని దాచిపెట్టి తన కూతురిని వివాహం చేసుకున్నాడని, పెళ్లైన నాటి నుంచి ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ముస్కాన్ తలకు గాయాలు ఉన్నాయని, భర్త దాడి చేయడం వల్లే ఆమె మృతి చెంది ఉంటుందని పోలీసుల ముందు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. సీసీటీవీ దృశ్యాల్లో ఆమె అకస్మాత్తుగా కింద పడిపోవడం రికార్డ్ అయింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త నిలేష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరణానికి గల కచ్చితమైన కారణాలను నిర్ధారించడానికి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.