ఇండియా కూటమి భేటీ ముగింపు.. ఈసీ, ఎన్డీఏపై తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు..!

India Alliance Meeting

న్యూఢిల్లీ, అక్టోబర్ 13, 2026: దేశ రాజధానిలో జరిగిన ప్రతిపక్ష ‘ఇండియా’ (INDIA) కూటమి నేతల సమావేశం ముగిసింది. ఈ భేటీ అనంతరం ఆర్జేడీ యువ నేత తేజస్వీ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ), ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు స్వయంగా ఎన్నికల సంఘమే (సీఈసీ) ప్రయత్నించిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షాల చేతుల్లో సీఈసీ జ్ఞానేష్‌ కుమార్ ఒక తోలుబొమ్మలా పనిచేశారని తేజస్వీ యాదవ్ విమర్శించారు. అమిత్‌షా, జ్ఞానేష్‌ కుమార్‌లు ఇద్దరూ కలిసి ఓట్ల చోరీకి పాల్పడ్డారన్నది జగమెరిగిన వాస్తవమని ఆయన మండిపడ్డారు. మరోవైపు, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపే హక్కును కాలరాస్తూ జంతర్‌మంతర్‌లో ఆందోళనలను నిషేధించడం ఎన్డీఏ ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ఇండియా కూటమి నేతలు ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.