సీజేపీ నేతల అరెస్ట్.. దీప్కే రిలీజ్.. ఆ ఇద్దరు ఇంకా జైలులోనే ఎందుకు ఉన్నారంటే?

CJP Protest

న్యూఢిల్లీ, అక్టోబర్ 17, 2026: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చీఫ్ అభిజిత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు శనివారం విడుదల చేశారు. ఢిల్లీ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో, ‘పీస్ బాండ్’పై సంతకం చేసి ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. శుక్రవారం ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో జరగాల్సిన ‘తిరంగా మార్చ్‌’ కోసం వెళ్తుండగా దీప్కేను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

సౌరవ్ దాస్, రాంకాలు ఇంకా జైలులోనే ఎందుకు? అభిజిత్ దీప్కే అరెస్టైన కొన్ని గంటలకే విడుదలైనప్పటికీ, సీజేపీ కో-కన్వీనర్లు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లు ఇంకా జైలులోనే ఉన్నారు. దీప్కేను సెంట్రల్ పార్క్‌కు చేరుకోకముందే పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయగా, ఆంక్షలు ఉన్నప్పటికీ దొంగచాటుగా జంతర్ మంతర్ చేరుకున్న సౌరవ్, రాంకాలను అక్కడే అరెస్ట్ చేయడం దీనికి ప్రధాన కారణమని న్యాయ నిపుణులు వివరిస్తున్నారు.

5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం, నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు అక్టోబర్ 10న జరిగిన జంతర్ మంతర్ నిరసనలో బాండ్ నిబంధనలు బ్రేక్ చేసినందుకు గాను వీరికి కోర్టు 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వీరితో పాటు అక్టోబర్ 13న అరెస్టయిన మరో సీజేపీ సభ్యుడు అజింక్య షిండేను వ్యక్తిగత పూచీకత్తు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోననే హామీపై ఆరు నెలల బాండ్‌తో విడుదల చేశారు.

ఏ చట్టాల కింద కేసులు నమోదు చేశారంటే? దీప్కే, దాస్, రాంకాలపై భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) చట్టంలోని సెక్షన్లు 126, 170 కింద ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారు. సెక్షన్ 170 ప్రకారం గుర్తించదగిన నేరాన్ని నివారించేందుకు ముందస్తు అరెస్టులు చేయవచ్చు. సెక్షన్ 126 ప్రకారం శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ బాండ్ ఆదేశాలు ఇవ్వొచ్చు. అక్టోబర్ 10న ఢిల్లీలో జరిగిన నిరసన సందర్భంగా ఈ ముగ్గురు కూడా శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోమని ఏడాది కాలానికి రూ. 50,000 బాండ్‌పై సంతకం చేసిన విషయం తెలిసిందే.