మరో సంచలన తీర్పు.. భర్తను చంపి పాము కాటుగా చిత్రీకరించిన భార్య, ప్రియుడికి ఉరిశిక్ష

Meerut Murder Case

జాతీయం, అక్టోబర్ 16, 2026: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ కోర్టు మరో సంచలన తీర్పు వెలువరించింది. ఇటీవల మీరట్ ‘బ్లూ డ్రమ్’ హత్య కేసులో ఇద్దరికి మరణశిక్ష విధించిన రెండు రోజుల వ్యవధిలోనే, మరో దారుణ హత్య కేసులో భార్య, ఆమె ప్రియుడికి ఉరిశిక్ష (మరణశిక్ష) ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. భర్తను గొంతు నులిమి దారుణంగా చంపి, అది పాము కాటు వల్ల జరిగిన సహజ మరణంగా నమ్మించేందుకు మృతదేహం పక్కన పామును ఉంచిన కేసులో న్యాయస్థానం ఈ కఠిన శిక్ష విధించింది.

పాము కాటు డ్రామా.. అసలేం జరిగిందంటే? మీరట్‌లోని అక్బర్‌పూర్ సాదత్ గ్రామానికి చెందిన టైల్స్ వర్కర్ అమిత్ కశ్యప్ (32) భార్య రవితా కశ్యప్ (30)కు, అమిత్ వద్ద పనిచేసే అమర్‌దీప్ (23)కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం అమిత్‌కు తెలియడంతో అతడిని అడ్డుతొలగించుకోవాలని ఇద్దరూ కుట్ర పన్నారు. ఇందులో భాగంగా పూజ కోసమని చెప్పి ఒక పాములవాడి వద్ద నుంచి రూ. 1,000 పెట్టి ఒక పామును కొనుగోలు చేశారు.

గతేడాది ఏప్రిల్ 12, 2025 రాత్రి అమిత్ గాఢ నిద్రలో ఉన్న సమయంలో, రవిత తన ప్రియుడు అమర్‌దీప్‌ను ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కలిసి అమిత్‌ను గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం అతడు పాముకాటుతో చనిపోయాడని కుటుంబ సభ్యులను నమ్మించేందుకు, మృతదేహం పక్కన ముందుగా తెచ్చిపెట్టుకున్న పామును వదిలేశారు.

పోస్టుమార్టంలో బట్టబయలైన నిజం మరుసటి రోజు ఉదయం అమిత్ మెడపై ఉన్న గుర్తులను చూసి అనుమానం వచ్చిన బంధువులు, మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపాలని పట్టుబట్టారు. పోస్టుమార్టం నివేదికలో అమిత్ గొంతు నులిమి చంపబడ్డాడని, పైగా అక్కడ వదిలిన పాము తీవ్రమైన విషపూరితమైనది కాదని తేలడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో రవితా నిజం ఒప్పుకోవడంతో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ కేసులో 12 మంది సాక్షులను విచారించిన మీరట్ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి జైవీర్ సింగ్ నాగర్.. రవితా, అమర్‌దీప్‌లను దోషులుగా తేల్చి మరణశిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఒకే బ్యారక్‌లో ఇద్దరు ఉరిశిక్ష పడ్డ మహిళలు ఇటీవల ‘బ్లూ డ్రమ్’ హత్య కేసులో ఉరిశిక్ష పడిన ముస్కాన్ రస్తోగి, తాజా కేసులో మరణశిక్ష పడ్డ రవితా కశ్యప్ ఇద్దరూ మీరట్ చౌదరి చరణ్ సింగ్ జిల్లా జైలులోని ఒకే బ్యారక్ (బ్యారక్ 2B)లో శిక్ష అనుభవిస్తుండటం గమనార్హం.