ఢిల్లీలో హైటెన్షన్.. ‘తిరంగా మార్చ్’కు ముందే సీజేపీ అధినేత అభిజీత్ దీప్కే అరెస్ట్!

న్యూఢిల్లీ, అక్టోబర్ 16, 2026: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన ‘తిరంగా మార్చ్’కు కొద్ది నిమిషాల ముందు ఆ పార్టీ వ్యవస్థాపకుడు, చీఫ్ అభిజీత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు శుక్రవారం ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించరాదంటూ నోటీసులు అందజేసిన పోలీసులు, అనంతరం ఈ అరెస్ట్ చర్యలు చేపట్టారు.
వారం వ్యవధిలో ఇది రెండోసారి.. సీజేపీ అధినేత అభిజీత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకోవడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అక్రమాలు జరిగాయంటూ సీఈసీ జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ఆయన ముంబై నుంచి ఢిల్లీకి చేరుకోగానే.. విమానాశ్రయంలోనే పోలీసులు తొలిసారి అదుపులోకి తీసుకున్నారు.
తిరంగా మార్చ్ ఎందుకంటే? అక్టోబర్ 13న జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘటనకు నిరసనగా సీజేపీ ఈ ‘తిరంగా మార్చ్’కు పిలుపునిచ్చింది. జంతర్ మంతర్ను నిరసన ప్రాంతంగా డీనోటిఫై చేసిన మరుసటి రోజే.. అక్కడ జాతీయ జెండాతో ప్రవేశించినందుకు సీజేపీ సభ్యులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు అరెస్ట్ చేసి 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. దీనికి వ్యతిరేకంగానే నేడు మార్చ్ చేపట్టేందుకు సీజేపీ సిద్ధమైంది.
బీఎన్ఎస్ సెక్షన్ 163 కింద నోటీసులు.. అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకోవడానికి ముందే ఆయన ఇంటికి వెళ్లిన ఢిల్లీ పోలీసులు.. బీఎన్ఎస్ సెక్షన్ 163 ప్రకారం అధికారిక నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ నగర కేంద్రమైన కన్నాట్ ప్లేస్ పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) ఎలాంటి ముందస్తు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. జాతీయ జెండాను ఎగురవేయడం నేరం కానప్పటికీ, అనుమతి లేకుండా జనాన్ని సమీకరించి ర్యాలీ నిర్వహించడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని హెచ్చరించారు.
వైరల్గా మారిన వీడియో.. అరెస్ట్ సమయంలో 31 ఏళ్ల అభిజీత్ దీప్కే.. గాంధీ బొమ్మ ఉన్న తెల్లటి టీ-షర్ట్, బ్లూ డెనిమ్స్ ధరించి భుజంపై జాతీయ జెండా వేసుకుని ఉన్నారు. పోలీసుల నుంచి నోటీసులు అందుకుంటున్న సమయంలో “నాపై ఎలాంటి ఆరోపణలు మోపుతున్నారు?” అని ఆయన ప్రశ్నించగా, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి తీవ్ర చర్చనీయాంశమైంది.
