అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా యూపీఐ పేమెంట్స్ బంద్.. ‘నో యూపీఐ డే’కి వ్యాపారుల పిలుపు

No UPI Day

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24, 2026: డిజిటల్ చెల్లింపుల విషయంలో సామాన్యులకు మరియు వినియోగదారులకు ముఖ్య గమనిక.అక్టోబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా యూపీఐ (UPI) సేవలు దుకాణాల్లో అందుబాటులో ఉండకపోవచ్చు.యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న ట్రేడర్లు, బిజినెస్ అసోసియేషన్లు అక్టోబర్ 2న ‘నో యూపీఐ డే’ (No UPI Day) పాటించాలని నిర్ణయించాయి.గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను పూర్తిగా బహిష్కరించి, కేవలం నగదు రూపంలోనే లావాదేవీలు జరపనున్నారు.

స్కాన్‌ర్లు, క్యూఆర్ కోడ్‌లపై నల్ల బట్ట

నిరసనలో భాగంగా అక్టోబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా ఏ దుకాణంలోనూ డిజిటల్ చెల్లింపులను స్వీకరించబోమని వ్యాపార సంఘాలు స్పష్టం చేశాయి.కస్టమర్లు పేమెంట్ చేసేందుకు వీలుగా ఉండే స్కాన్‌ర్లు, క్యూఆర్ (QR) కోడ్‌లు, మరియు సౌండ్ బాక్సులను ఆ రోజున పూర్తిగా బ్లాక్ క్లాత్ (నల్ల బట్ట)తో కప్పి ఉంచుతామని వ్యాపారులు తెలిపారు.దేశంలోని అన్ని ప్రముఖ అసోసియేషన్లతో చర్చించిన తర్వాతే ఈ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ (MACCIA) ప్రెసిడెంట్ రవీంద్ర మంగవే అధికారికంగా వెల్లడించారు.

అసలు ఎందుకీ నిరసన?

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం, అక్టోబర్ 15 నుంచి రూ. 2,000 కు పైబడిన పీర్-టు-మర్చంట్ (P2M) యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం మేర MDR ఛార్జీలను వసూలు చేయనున్నారు.ఈ ఛార్జీ గరిష్టంగా ఒక లావాదేవీకి రూ.300 వరకు ఉంటుంది.

ఈ కొత్త నిబంధన వ్యాపారులకు ఆర్థికంగా గుదిబండగా మారుతుందని ట్రేడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే చాలా వ్యాపారాలు అత్యంత తక్కువ లాభాల (Narrow Margins) తో నడుస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో డిజిటల్ చెల్లింపుల పేరుతో అదనపు భారం మోపడం వల్ల చిన్న, మధ్య తరహా వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు వాదిస్తున్నారు.

ఆందోళనలో ఏయే సంఘాలు పాల్గొంటున్నాయి?

MACCIA ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనకు దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా ఈ కింది సంఘాలు ప్రత్యక్షంగా ఈ ‘నో యూపీఐ డే’లో పాల్గొంటున్నాయి:

  • ఫెడరేషన్ ఆఫ్ రిటైల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (FRTWA)
  • ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ (AICPDF)
  • ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (AIMRA)
  • ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ (AIJGF)

వినియోగదారులకు సూచన

అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా మెజారిటీ దుకాణాలు, పెట్రోల్ పంపులు, సూపర్ మార్కెట్లు యూపీఐ చెల్లింపులను నిలిపివేసే అవకాశం ఉన్నందున, ఆ రోజున షాపింగ్ లేదా ప్రయాణాలు చేసే వారు తమ వెంట తగినంత నగదు (Cash) ఉంచుకోవడం ఉత్తమం.

ఈ నిరసనల దృష్ట్యా ప్రభుత్వం లేదా NPCI ఈ కొత్త MDR ఛార్జీల అమలుపై (అక్టోబర్ 15 కంటే ముందు) ఏదైనా వెనక్కి తగ్గుతుందా లేదా నిబంధనలను సడలిస్తుందా అనేది వేచి చూడాలి.