ప్రశాంత్ కిషోర్ ‘జన సూరజ్’ పార్టీకి భారీ షాక్.. టికెట్ దక్కిన 24 గంటల్లోనే అభ్యర్థి రాజీనామా..!

పాట్నా, సెప్టెంబర్ 26, 2026: బీహార్ శాసన మండలి (MLC) ఎన్నికల వేళ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ‘జన సూరజ్’ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తిర్హుత్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి జన సూరజ్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన భూషణ్ ఝా.. టికెట్ దక్కిన 24 గంటల్లోనే పార్టీకి రాజీనామా చేశారు. తాను రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగానే బరిలో దిగుతున్నట్లు ప్రకటించి పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేశారు.
ఈ అనూహ్య నిర్ణయానికి గల కారణాలను భూషణ్ ఝా మీడియాకు వివరించారు. సెప్టెంబర్ 25న పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఒక సమీక్షా సమావేశంలో తనకు తీవ్ర అవమానం జరిగిందని ఆయన ఆరోపించారు. సమావేశంలో తన వాదనను, సొంత అభిప్రాయాలను వెల్లడించే ప్రయత్నం చేయగా.. పార్టీ నాయకత్వం తనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పార్టీ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే మాట్లాడాలని తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఆయన స్పష్టం చేశారు.
పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం, భావప్రకటన స్వేచ్ఛ కరువయ్యాయని విమర్శించిన భూషణ్ ఝా.. అందుకే పార్టీకి దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తాజా పరిణామం బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యామ్నాయ రాజకీయాలు సాధిస్తామంటూ ఎన్నికల బరిలోకి దిగుతున్న తొలి దశలోనే అభ్యర్థి ఇలా తిరుగుబాటు చేసి బయటకు రావడం జన సూరజ్ పార్టీకి పెద్ద షాక్ గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
