తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్

Telangana Cyber Crime Operation

హైదరాబాద్, అక్టోబర్ 07, 2026: సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాలపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. దేశవ్యాప్తంగా విస్తరించిన సైబర్ నేరగాళ్ల నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అత్యంత భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఏకంగా ఆరు రాష్ట్రాల్లో దాడులు చేసి 101 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ ఏకకాలంలో కొనసాగింది. పట్టుబడిన 101 మంది నిందితుల్లో 83 మంది పురుషులు ఉండగా, 18 మంది మహిళలు ఉన్నారు. వీరంతా ప్రధానంగా సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్ అకౌంట్స్’ (కమీషన్ కోసం ఇతరుల పేరుతో తెరిచిన బ్యాంకు ఖాతాలు) సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

దేశవ్యాప్తంగా నమోదైన సుమారు 1,172 సైబర్ క్రైమ్ కేసుల్లో ఈ నిందితులకు ప్రమేయం ఉన్నట్లు సైబర్ క్రైమ్ బ్యూరో నిర్ధారించింది. అమాయకుల పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిపించి, సైబర్ మోసాల ద్వారా కాజేసిన డబ్బును ఆ ఖాతాల్లోకి బదిలీ చేయిస్తున్న ఈ భారీ ముఠాను పట్టుకోవడం పోలీసుల అతిపెద్ద విజయంగా భావిస్తున్నారు. ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారుల కోసం పోలీసులు తదుపరి విచారణను ముమ్మరం చేశారు.