Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Veligonda Project inauguration CM Chandrababu Naidu

మార్కాపురం, ఆగస్టు 31, 2026: Veligonda Project- ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. దశాబ్దాలుగా తీవ్ర వర్షాభావం, కరువుతో అల్లాడుతున్న ప్రాంతాలకు జీవజలాన్ని అందించే ప్రతిష్టాత్మక ‘పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు’ తొలి దశ (ఫేజ్-1) ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఆగస్టు 31 సోమవారం మార్కాపురం జిల్లా గంటవానిపల్లి వద్ద ముఖ్యమంత్రి ఈ చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టారు.

‘వెలిగొండ జలసిరులు–అభివృద్ధికి రెక్కలు’

ఉదయం గంటవానిపల్లికి చేరుకున్న సీఎం చంద్రబాబు, ముందుగా వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ పైలాన్‌ను ఆవిష్కరించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ప్రాజెక్టు గేట్లను ఎత్తి నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలను విడుదల చేశారు. ‘వెలిగొండ జలసిరులు–అభివృద్ధికి రెక్కలు’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించింది. శ్రీశైలం జలాశయం నుంచి నల్లమల కొండలను చీల్చుకుంటూ రెండు భారీ సొరంగాల గుండా కృష్ణమ్మ పరుగులు తీస్తూ రావడం చూసి స్థానిక రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

తొలిదశతో ఎన్ని ఎకరాలకు సాగునీరు?

ఈ ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కృష్ణా వరద జలాలను గ్రావిటీ ద్వారా నల్లమల సాగర్ కు తరలిస్తారు.

  • తొలి దశ ప్రయోజనాలు: ఫేజ్-1 ప్రారంభం ద్వారా 10.70 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేస్తున్నారు. దీని ద్వారా సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న 4 లక్షల మందికి సురక్షితమైన తాగునీరు అందనుంది.
  • పూర్తి స్థాయి సామర్థ్యం: ప్రాజెక్టు వంద శాతం పూర్తైతే పశ్చిమ ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాలకు చెందిన 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి పైగా ప్రజలకు తాగునీటి కష్టాలు తీరనున్నాయి.

1996 నాటి సంకల్పం.. నేడు సాకారం

1996లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే వెలిగొండ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. అటవీ అనుమతులు, సొరంగాల నిర్మాణం, భూసేకరణ లాంటి ఎన్నో ఆటంకాలు, సాంకేతిక సవాళ్లను అధిగమిస్తూ దశాబ్దాల తర్వాత ప్రాజెక్టు తొలిదశ అందుబాటులోకి వచ్చింది. “శంకుస్థాపన చేసిందీ చంద్రబాబే.. ప్రారంభిస్తున్నదీ చంద్రబాబే” అంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు రాకతో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం, అగ్రో ప్రాసెసింగ్ రంగాలు అభివృద్ధి చెందుతాయని, వలసలకు శాశ్వతంగా అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రారంభోత్సవం అనంతరం గంటవానిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.