బిజినెస్, ఆగస్టు 26, 2026: Mukesh Ambani – టెలికాం, రిటైల్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో తనదైన ముద్ర వేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇప్పుడు మెటల్స్ రంగంపై కన్నేశారు.దేశీయంగా భారీ డిమాండ్ ఉన్న అల్యూమినియం ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించే అంశాన్ని రిలయన్స్ సీరియస్‌గా పరిశీలిస్తోంది.అటు మరో అపర కుబేరుడు గౌతమ్ అదానీ కూడా ఈ రంగంలోకి భారీ పెట్టుబడులతో అడుగుపెడుతుండటంతో, రాబోయే రోజుల్లో అంబానీ వర్సెస్ అదానీ పోటీ రసవత్తరంగా మారనుంది.
ఏపీ ప్రాజెక్టుతో అనుసంధానం
రిలయన్స్ అల్యూమినియం రంగంలోకి అడుగుపెట్టడానికి ప్రధాన కారణం.. ఆంధ్రప్రదేశ్‌లో వారు ప్లాన్ చేస్తున్న భారీ ‘బొగ్గు గ్యాసిఫికేషన్ (Coal Gasification)’ ప్రాజెక్టు.ఏపీలోని రెచర్ల, చింతలపూడి వద్ద వేలంలో రిలయన్స్ ఇప్పటికే రెండు బొగ్గు బ్లాకులను దక్కించుకుంది.రాబోయే 30 ఏళ్లలో సుమారు రూ.2.73 లక్షల కోట్లతో ఈ భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు.
ఈ ప్రక్రియ ద్వారా వెలువడే ఇంధనాన్ని (సింథటిక్ గ్యాస్) అత్యంత భారీ స్థాయిలో విద్యుత్ అవసరమయ్యే అల్యూమినియం స్మెల్టింగ్, ఉత్పత్తికి వాడుకోవాలని కంపెనీ వ్యూహరచన చేస్తోంది.తద్వారా విద్యుత్ ఖర్చులను తగ్గించుకుని వ్యాపారపరంగా లాభాలు ఆర్జించవచ్చని రిలయన్స్ భావిస్తోంది.
ఒడిశా బాక్సైట్ బ్లాక్‌పై గురి
అల్యూమినియం తయారీకి అత్యంత కీలకమైన ముడిసరుకు బాక్సైట్. దీనికోసం రిలయన్స్ ఒడిశాలోని ప్రతిష్టాత్మక ‘కార్లాపత్ బాక్సైట్ బ్లాక్’ పై దృష్టి సారించింది.సుమారు 3,100 హెక్టార్లలో విస్తరించి, 200 మిలియన్ టన్నులకు పైగా బాక్సైట్ నిల్వలు ఉన్న ఈ బ్లాక్ కోసం రిలయన్స్ టెండర్ పత్రాలను కూడా కొనుగోలు చేసింది.అయితే, ఈ వేలంలో వేదాంత గ్రూపునకు చెందిన ‘బాల్కో’ సంస్థ రికార్డు స్థాయిలో 175 శాతం ప్రీమియంతో బ్లాక్‌ను దక్కించుకున్నప్పటికీ, అల్యూమినియం వాల్యూ చైన్‌పై రిలయన్స్‌కు ఉన్న ఆసక్తి ఏంటో ఈ బిడ్డింగ్ ద్వారా స్పష్టమైంది.
అదానీ వర్సెస్ అంబానీ: మెటల్స్ రంగంలో కొత్త పోటీ
గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ కూడా అల్యూమినియం రంగంలో తన ముద్ర వేసేందుకు సిద్ధమైంది.ఒడిశాలో యూఏఈకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (IHC) భాగస్వామ్యంతో ఏటా 2 మిలియన్ టన్నుల సామర్థ్యం గల భారీ అల్యూమినియం ప్రాజెక్టు కోసం సుమారు $11.5 బిలియన్ల (రూ.95 వేల కోట్లకు పైగా) పెట్టుబడిని అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఇటీవల ప్రకటించింది.
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ, మౌలిక సదుపాయాల రంగం వేగంగా విస్తరిస్తుండటంతో అల్యూమినియంకు భవిష్యత్తులో భారీ డిమాండ్ ఉండనుంది.ఇప్పటికే వేదాంత, హిండాల్కో వంటి దిగ్గజాలున్న ఈ రంగంలోకి.. ఇప్పుడు దేశంలోని ఇద్దరు అగ్రశ్రేణి వ్యాపారవేత్తలు (అంబానీ, అదానీ) ప్రవేశిస్తుండటం పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Leave a Reply